- మంచి ఉద్దేశంతో 22ఏ తెచ్చారు
- తప్పు చేసిన అధికారులపై కేసు పెట్టి శిక్షించాలి
- ఢిల్లీలో ఎంపీ రఘునందన్ రావు డిమాండ్
ఢిల్లీ, వెలుగు: ధరణి, భూభారతిలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ హైకోర్ట్ జడ్జితో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపి ఎంపీ రఘునందర్ రావు డిమాండ్ చేశారు. గుడులు, బడులు, ప్రభుత్వ స్థలాలను మింగేయకుండా మంచి ఆలోచన, లక్ష్యంతో 22ఏ చట్టం తెచ్చారన్నారు. 22ఏ విషయంలో తప్పు చేస్తే మంత్రిని భర్తరఫ్ చెయ్యాలని, లేదంటే తప్పులు చేసిన అధికారులపై కేసులు నమోదు చేసి... చట్ట ప్రకారం శిక్షించాలన్నారు. ప్రస్తుతం అసైన్డ్ చట్టాన్ని ఎత్తివేస్తారని ప్రచారం జరుగుతోందన్నారు. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూముల వివరాలు, అవి ఎవరి కంట్రోల్ లో ఉన్నాయో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపీ మీడియాతో మాట్లాడారు. 22 ఏ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దొంగ–పోలీస్ ఆట ఆడుతున్నాయని విమర్శించారు. ఈ నిషేధిత జాబితాలోకి కోటి ఎక్కరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ దాదాపు 43 వేల ఎకరాలు ఈ జాబితా నుంచి తీసేసామని చెబుతోందని, ఆ వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. సింఫోనీ కాలనీలో సమస్య ఉందని, అందుకే ప్రతిపక్ష పార్టీలుగా బీజేపీ, బీఆర్ఎస్ లు మాట్లాడుతున్నాయన్నారు. ఒక సమస్య గురించి మాట్లాడితే.. రెండు పార్టీలు ఒక్కటే అని కాంగ్రెస్ నేతలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో 22ఏ పై వాస్తవాలు మాట్లాడాలని, దీనిపై పూర్తి చర్చ అవసరం అన్నారు. యూనిఫార్మ్స్ సివిల్ కోడ్ చట్టాన్ని ఎవరికి ఇష్టమున్న లేకున్నా దేశంలో అమలు చేస్తామని స్పష్టం చేశారు.
